Nothing Special   »   [go: up one dir, main page]

Thursday, October 27, 2016

How to prepare కాయం(kaayam)

కాయం”

”పంతులుగారు! రండి రండి, ఒరే సుబ్బరాజూ పంతులుగారికి కుర్చీ వెయ్యి. ఏమండి అమ్మాయి పురిటికొచ్చిందాన్నారు, పురుడొచ్చిందా?”

”నిన్న రాత్రి అమ్మాయి ప్రసవించిందయ్యా! ఆడపిల్ల, తల్లీ బిడ్డా కులాసా, కాయం సరుకులకొచ్చాను.”

”మీరేరావాలా? కబురుపెడితే పంపకపోదునా? ఒరే సుబ్బరాజూ ఆ పనొదిలేసి ముందు పంతులుగారికి కాయం సరుకులు కట్టు, నెలకి కట్టమంటారా? మూడు నెలలకీ కట్టించెయ్యనా?” ఇలా సాగిపోయేది సంభాషణ. ‘కాయం ‘ అన్నది నాటి రోజులలో, పురుడొచ్చిన మూడవరోజునుంచి బాలెంతకి పెట్టేవారు, మూడు నెలలపాటు. ఈ కాయం తినడం మూలంగా పురటాలు ఆరోగ్యం బాగుండేది,ఒళ్ళు  గట్టిపడేది, పాలు తొందరగా, బిడ్డకి కావలసినన్ని పడేవి, పురటాలికి నడుమునొప్పి వగైరా ఉండేవి కావు, ఈ సరుకులన్నీ కిరణా కొట్టులో దొరికేవి, అదే కాక కిరణా కొట్టతనికి కూడా వీటి విషయం తెలిసుండేది. ఆ సరుకుల వివరం, మొన్న మాటల సందర్భంగా ఇల్లాలినడిగితే చెప్పింది. ఈ కాయాన్ని ప్రతి రోజు ఉదయం సాయంత్రం బాలెంతకు పెట్టేవారు, చిన్న నిమ్మకాయంత,.ఇది తినడానికి బలే రుచిగా ఉంటుంది.

కావలసిన సరుకులు.

1. వాము-250 గ్రా
2. పిప్పళ్ళు-100
3.శొంఠి-50
4.మిరియాలు-50
5.దాల్చిన చెక్క-100
6.పిప్పలకట్టి-100
7.దుంపరాష్ట్రం ఒక దుంప.
8.కళింగ రాష్ట్రం ఒక దుంప.
9.పసుపు కొమ్ము-1
10.వసకొమ్ము- ఒకటి.
11.ఆవు నెయ్యి
12.తాటి బెల్లం.

పై సరుకులన్నిటిని ఆవునెయ్యి కొద్దిగా వేసి దోరగా వేపుకుని తీసుకోవాలి, తాటిబెల్లం,కాకుండా,.వేరు, వేరుగా, అన్నిటిని విడివిడిగా మెత్తగా దంచుకోవాలి, అమాన్ దస్తాలో. అన్ని గుండలూ గుచ్చెత్తి దానికి సరిపడా మెత్తగా చేసుకున్న పాతబెల్లం వేసి కలపాలి. ఈ మొత్తం గుండకి తగు ఆవునేతిని కరిగించి పోసి ముద్దగా కలుపుకుని తడిలేని గాజు సీసా లో పెట్టుకోవాలి.

బెల్లo,ఆవునెయ్యి కలపకుండా ఉంచుకున్న గుండను అప్పటికప్పుడు మంచినీళ్ళతో ఉడకపెట్టి,అందులో బెల్లం వేసి, కొద్దిగా ఆవునెయ్యి వేసి తయారు చేసుకున్న దానిని ”ఉడుకు కాయం” అనేవారు. ఇది రెండు, మూడు రోజులు తప్పించి, ఎక్కువ కాలం నిలవ ఉండదు.

దీనిని రోజూ రెండు పూటలా పురటాలికి పెడితే బాగుంటుంది.