ధన త్రయోదశి
ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.
వ్రత విధానం
[మార్చు]ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి.
ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.
ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు.